ఇంటి వెనకాల తోటలో పని ఉందని ఆ రోజు వర్షం తగ్గితే రమ్మన్నారు పెద్దరాజుగారు, అక్కడ పనిలో ఉండగా రాజయ్యకి ఒక నాగు పాము పిల్ల కనిపించింది, తనతో పాటు ఉన్న మరో కుర్రాడు పాముని చూసి బిగ్గరగా పాము పాము అని అరిచాడు, అందరు అక్కడ గుమిగూడారు, ఈ లోపే రజయ్య ఆ పాముని అక్కడి నుండి తోలేశాడు, చంపకుండా వదిలేసావెంటని రాజుగారు మండిపడ్డారు, చిన్న పిల్ల పాము అని వదిలేసా అన్నాడు రాజయ్య.
అందరూ రాజయ్యని తిట్టారు కాని ఒక్క దివ్య మాత్రం రాజయ్యని వెనకేసుకొచ్చింది, ఆ వూరిలో అతన్ని ఒక మనిషిగా చూసేది పెద్దరాజుగారి అమ్మయి దివ్య ఒక్కతే, తనకి 10 సంవత్సరాలు వయసు! అతను మాత్రం ఒక చిరు నవ్వు నవ్వి తన పని తను చేస్కు పోవడంలో మునిగిపోయాడు.
రాజయ్యకి జాలి ఎక్కువ కానీ ఆ వూరి వాళ్ళు తమ అవసరాలకు అతన్ని ఉపయొగించుకుని వదిలేస్తారు, ఆ విషయం రాజయ్యకి తెలిసినా పట్టనట్టు ఉంటాడు, రాజయ్యకి పెద్దరాజుగారి అమ్మయి దివ్య అంటే అభిమానం, ఆ పిల్లే లోకం, తను రోజూ స్కూలు నుండి వచ్చాక రాజయ్యతో కబుర్లు చెప్తూ గడిపేది, రాజయ్యకి తనే ప్రపంచం.
ఆమెకు బోలెడు కథలు చెప్పేవాడు, ఆ కథలన్నీ ఎంతో చక్కగా కొత్తగా అందముగా వర్ణించి చెప్పేవాడు రాజయ్య, అవి తన జీవిత అనుభవాలను రంగరించి రాజయ్య ఆప్యాయంగా చెప్పే కథలు, దివ్య మనసులో ఆ కథలు బలంగా నాటుకు పోయాయి..
ఒక రోజు పెదరాజుగారి తోటలో పని చేస్తుండగా ఒక్క ఉదుటున కుప్పకూలిపోయాడు రాజయ్య, ఆ సమయంలో పెద్దరాజుగారు కూడా లేరు, విషయం తెలిసి దివ్య పరుగు పరుగున వచ్చింది, రాజయ్యని అలా చుడలేకపోయింది, దివ్య చేయి గట్టిగా అదిమి పట్టుకుని రాజయ్య కన్నుమూశాడు.
15 సంవత్సరాల తర్వాత చిన్న పిల్లలకు కథలుగా, పుస్తక రూపంలో, అంతర్జాలంలో కొన్ని నవ్యమైన కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి, అవి "రాజయ్య కథలు"! ఈ కథలు చాల మందికి ప్రేరణగా నిలిచాయి..
ఆ కథా సంకలనానికి కర్త, కర్మ, క్రియ..
దివ్య... మట్టిలో మాణిక్యాలున్నాయి అని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది
రాజయ్య ప్రాణంగా చూసుకున్న పెద్దరాజుగారి అమ్మయి!