జరుగుతున్నది జగన్నాటకం (2)
పురాతనపు పురాణ వర్ణన పైకి
కనబడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని
భాగవత లీలల అంతరార్థం
ఈ రహస్యము గ్రహించే మతికెరుక
గలుగును పరమతత్త్వం
జరుగుతున్నది జగన్నాటకం (2)
మత్స్వావతారం
చెలియలికట్టను తెంచుకొని
విలయము విజృంభించునని
ధర్మమూలమే మరచిన జగతిని
యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి
సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం
కాలగతిని సవరించిన సాక్ష్యం
కూర్మావతారం
చేయదలచిన మహత్కార్యము
మోయజాలని భారమైతే
పొందగోరినదందలేదని నిరాశలో
అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు
సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన
ఓరిమే కూర్మమన్నది
క్షీరసాగరమథన మర్మం
వరాహావతారం
ఉనికిని నిలిపే ఇలను కడలిలో
కలుపగనురికే ఉన్మాదమ్మును
కరాళదంష్ట్రల కుళ్లగించి
ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్ధత రణహుంకారం
ఆదివరాహపు అవతారం
నరసింహావతారం
ఏడీ ఎక్కడరా... నీ హరి?
దాక్కున్నాడేరా భయపడి?
బయటకు రమ్మనరా ఎదుటపడి
నన్ను గెలవగలడా కలబడి?
నువు నిలిచిన ఈ నేలను అడుగు
నీ నాడుల జీవజలమ్మును అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అణువుల ఆకాశాన్నడుగు
నీలో న రునీ హరినీ క లుపు
నీవే నరహరివని నువు తెలుపు
ఉన్మత్త మాతంగ
భంగి ఘాతుక వితతి
హంతృసంఘాత నిర్ఘృణ
నిబిడమీ జగతి
అఘము నగమై ఎదిగె
అవనికిది అశని హతి
ఆతతాయుల నిహతి
యనివార్యమౌ నియతి
జితహస్తి హతమస్తకాశి
నఖసమకాశియో
క్రూరాసి గ్రోసి
హుత్‌వాహు దంష్ట్రుల దోసి
మసి జేయు మహిత యజ్ఞం
వామనావతారం
అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం...
ఈ మానుషరూపం
కుబ్జాకృతిగా బుద్ధిని
భ్రమింపజేసే అల్పప్రమాణం
ముజ్జగాలనూ మూడడుగులతో
కొలిచే త్రైవిక్రమ విస్తరణం
పరశురామావతారం
రుక్షేక్షణోద్గీర్ణ దీక్షారణీ మన్థనోద్ఘాత
ప్రస్ఫురద్విస్ఫుకణమిదమ్ క్షాత్రమ్
ధృత్వరక్షాదక్ష ధృష్ట దమ
దిదృక్షా దధత్ ధిషణా
దృఘణమిద్ బ్రాహ్మ్యమ్
వీతరాగుడై జితక్రోధుడై
శమదమాది శుభలక్షణాత్ముడై
శాంతిధామమౌ స్వాంతము గలిగిన
సాధుజీవనుడు శ్రోత్రియుడు
పాపపు తరువై పుడమికి బరువై
పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై... భయద భీముడై... ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
శాత్రవాంతకుడు క్షత్రియుడు
సాత్త్విక రాజస గుణ సద్విభజన
తెలిపిన తత్త్వమె భార్గవుడు
రామావతారం
శ్లోకం : ఆత్మానమ్ మానుషమ్
మన్యే రామమ్ దశరథాత్మజమ్
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని
మిగలగలిగే మనికి
సాధ్యమేనని మనకి తెలిపె భవుని రామమూర్తిగా హరియె నిలిచె
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక
నమ్మశక్యము గాని ఏ మర్మము లేక
నిష్ఠతో ధర్మకర్మాచరణమె చాలు మట్టిబొమ్మయె పరబ్రహ్మగా
రాజిల్లు
అట్టి మర్యాదాపురుషోత్తముని
నామమననమె పరంధామ
మందగ జాలు
రామావతార తారక మంత్ర మవక దైవమంటే మనిషి బుద్ధికే మెరుక?
శ్రీకృష్ణావతారం
ఇన్ని రీతులుగా
ఇన్నిన్ని పాత్రలుగా...
నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింపజేయగల
జ్ఞానదర్పణము... కృష్ణావతరణ స్మరణమే సృష్ట్యావరణ తరణము
అణిమగా మహిమగా
గరిమగా లఘిమగా ప్రాప్తిగా
ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా
వశిత్వమ్ముగా
నీలోని అష్టసిద్ధులునీకు కన్పట్టగా...
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా...
నరుని లోపలి పరునిపై
దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవె
యన్న ఉపదేశమై ఉషనిషత్సారమే
యున్న భగవద్గీత ఉగ్గడించును
నరుడ నీకు నీ హృద్బోధ
వందే కృష్ణం జగద్గురుమ్
చిత్రం : కృష్ణం వందే జగద్గురుమ్
రచన : సిరివెన్నెల,
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.బాలు, బృందం
2 comments:
Chaala istamaina paata.yenni sarlu vinna malli malli vinali anipistundi
ఎంతో మంచి పాటె గుర్తొచ్చింది. చాలా బాగుంటుంది.
Post a Comment