తూర్పు కనుమలు - 8: ఇసుకపట్నం దేముడుబాబు
దక్షిణ భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరంగా "ఇసుకపట్నం" ప్రసిద్దిచేందింది. కొండల మధ్యలో అద్భుతమైన జివవైవిధ్యానికి నెలవుగా ఉంటూ ఒక సమశీతోష్ణ ప్రాంతంగా ఉన్నది. ఒక వైపు సముద్రం, మరోవైపు మడ అడవులు, చిత్తడి నేలలు , కొండల నుండి జాలు వారే సహజసిద్దమైన వాగులు, అరుదైన వృక్ష జాతులతో నీండిన ఎర్రమట్టి దిబ్బలు, తీర ప్రాంతం వెంబడి ఇసుకతిన్నెల పైన పరుచుకున్న తీగల పచ్చదనం, ఇది 1930 నాటి పరిస్థితి . రానురాను ఈ ప్రాంతం వేగంగా మార్పు చెందుతూ వచ్చింది.
1980వ దశకానికి వచ్చేసరికి పారిశ్రామీకరణ పుంజుకుంది. ఇసుకపట్నం ఓడ రేవు, దాని చుట్టుపక్కల పరిశ్రమలు వేగంగా విస్తరించాయి, నగర జనాభా, విస్తీర్ణం పెరిగిపోయాయి. దీని పర్యవసనంగా ఇక్కడి సహజసిద్ధమైన ప్రకృతి తీవ్ర ప్రభావానికి లోనయింది. సమశీతోష్ణ ప్రాంతం కాస్త కాలుష్యం బారిన పడింది. పర్యావరణం దెబ్బతిన్నది. 1990 నాటికి ఇసుకపట్నంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించి దేముడు బాబు అనే ఆసామి కొంత మంది మిత్రులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యావరణం, జీవవైవిధ్యం, సహజసిద్ధంగా తీరప్రాంత రక్షణ వంటి అంశాల పైన అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. ఆయా రంగాలలోని నిపుణులతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను, ప్రపంచవ్యాప్త పరిస్థితులను సేకరించి అందరికి అవగాహన కల్పించేవారు. కొంతకాలానికి అందరూ దేముడు బాబుని ఒంటరి చేసి ఎవరిపనులు వారు చూసుకోసాగారు, అయినా అయన పట్టువదలక పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
"సముద్ర తీర ప్రాంతాలలో సహజంగా ఉండే ఇసుకతీన్నెలు, మడ అడవుల సమూహాలు, తాటితోపులు , ఇసుక తీగలు లాంటివన్ని సముద్రపు ఉపద్రవాల నుండి మైదాన ప్రాంతాలకు రక్షణ కల్పిస్తాయి. పారిశ్రామీకరణ పేరుతో ఈనాడు సహజసిద్దంగా ఉన్న తీర ప్రాంత రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తున్నరు. భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతం ఎక్కువగా తుఫానుల తాకిడికి గురవుతుంది. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా పెరిగే దేశీయ చెట్లు, మొక్కలను సముద్రం నుండి నేల వైపుగా 500 మీటర్ల వరకూ పెంచితే అవి పెను గాలులను నియంత్రించగలవు. ఇది ఒక బఫర్ జోన్ లాగా పనిచేసి తీరం కోతను ఆపుతుంది. మడ అడవులు ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. నదుల సంగమ ప్రాంతాలలో అధికంగా అడవులు పెరుగుతాయి. నేటి రోజున అభివృద్ధి మాటున ఇవి విపరీతంగా తగ్గిపోవడం వల్ల తీర ప్రాంతంపై పెను మార్పులు ప్రభావం చుపిస్తున్నాయి. మడ అడవుల నరికివేత వల్ల జీవ వైవిధ్యం ప్రమాదకర స్తాయిలో దెబ్బతింటోంది. సముద్రపు అలల కోతలు, వాతావరణ మార్పుల వల్ల తరుచుగా తుఫానులు కోస్తా ప్రాంతం పైన విరుచుకుపడుతున్నాయి. " అని దేముడు బాబు 2010 సంవత్సరంలో ఒక అవగాహనా సదస్సులో చెప్పారు.
2020 నాటికి దేముడు బాబు కాలం చేసారు. అప్పటికే అయన చేస్తున్న పనిని ప్రజలు, ప్రభుత్వాలు గమనించసాగాయి. కొంత మంది తమ వంతుగా అన్నట్టు పర్యవరణ పరిరక్షణకు పాటుపడ్డారు. ఇసుకపట్నం పరిస్థితి రానురాను భయంకరంగా తయారవుతున్నదని అవగతమైంది, కానీ ఎవరు కూడా పూర్తీ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించలేదు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వ్యాపారంగా మార్చుకున్నారు. వేల సంఖ్యలో వెలసిన స్వచ్ఛంద సంస్థలు ఎవరికీ వారే యమునాతీరే అన్నట్టు ఉండిపోయారు. 2030 నాటికి ఐదు భయంకరమైన తుఫానులు ఇసుకపట్నం తీరాన్ని అతలాకుతలం చేసాయి, తూర్పు తీర ప్రాంతంలోని అతి పెద్ద నగరం వాతావరణ మార్పుల పెను ప్రభావానికి లోనయింది.
2050 నాటికి ఇసుకపట్నం నగర విస్తీర్ణం పావు వంతు మాత్రమే ఉన్నది. అభివృద్ధి పేరున నాశనం చేసుకున్న ప్రాంతమంతా ఆవాసయోగ్యంగా లేకుండా పోయింది, పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతిన్నాయి, భూగర్భ జలాలు ఉప్పుమయం అయిపోయాయి. ఇష్టారాజ్యంగా కొండలు తొలగించడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి, చుట్టూ ఉన్న అడవి తరిగిపోవడం వల్ల వర్షాలు లేవు. ఒకప్పుడు దేముడు బాబుని ఆదర్శంగా తీసుకుని ఎందరో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల ఈ పావు వంతు నగరం మనుగడ సాగించగలిగింది.
No comments:
Post a Comment